భాగవతం ప్రాముఖ్యత మరియు పన్నెండు స్కంధాల కథ.
వేదాంత పరంగా భాగవతం ప్రాముఖ్యత భాగవతంలోనే క్రింది శ్లోకంలో చెప్పబడింది.
సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే
తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్
శ్రీమద్భాగవతం సకల వేదాంత సారంగా చెప్పబడింది. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్యగా పరిగణింపబడుతున్నది. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.
భాగవతం ప్రాముఖ్యత గురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్రాశాడు - అష్టాదశ మహాపురాణాలను ప్రస్తావించిన దేవీభాగవతంలోని శ్లోకంలో భాగవతం ఉపపురాణంగా చెప్పబడింది. అప్పటిలో (దేవీభాగవతం 12వ శతాబ్దంలో రచింపబడిందని ఒక అభిప్రాయం) శాక్తేయమతానికి ప్రాధాన్యత కల్పించే ప్రయత్నంలో ఇలా వ్రాయబడి ఉండవచ్చునని ఒక అభిప్రాయం ఉంది.
లోకంలో మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు. ఈ మహా గ్రంథం ఆసేతుశీతాచల వ్యాప్త పండిత మండలీ కంఠస్థగిత విపుల మణిహారమై, నానా మత ప్రస్థాన సిద్ధాంతావిరుద్ధ ప్రమాణ తర్క సాధనోపాలంభ పూర్వక దుర్విగాహ భక్తి స్వరూప నిరూపణ ఫల వ్యాచి ఖ్యాసువులకు ఆలవాలమై, గీర్వాణ వాణీ తరుణారుణ చరణారవింద మరందాస్వాదలోల హృన్మత్త మిళింద చక్రవర్తులచే బహుభాషలలోనికి అనూదితమై, మోక్షాభిలాషుల మనస్సులలో భద్రముద్రాంకితమై, నిజానికి పురాణమంటే ఇదేనన్నంత అవిరళమైన ప్రచారాన్ని గడించింది. .. ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన ఈ ఉద్గ్రంథం భారతదేశంలోని సారస్వతేయుల మహాప్రతిభకు ప్రధమోదాహరణమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది. [3]