వేద సూక్తులు

పురుష సూక్తం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం — పరిచయంతో సహా.

సూక్తములు గురించి
శ్రీ పురుష సూక్తం
నారాయణ సూక్తం
శ్రీ సూక్తం

సూక్తములు గురించి

ఈ సమస్త విశ్వం పంచభూతాలతో నిర్మితమై ఉంది. ఆ పంచభూతాల నుంచే సమస్తాన్ని సృష్టించి, పోషిస్తూ, నియంత్రించే పరమాత్మను దర్శించాలనే తపనతో ఋషులు తీవ్రమైన తపస్సు చేశారు. ఆ మహాపురుషుని స్వరూపాన్ని అవగాహన చేసుకొని, ఆయనను ఆరాధించాలనే ఆరాటంలో వారు నిమగ్నమయ్యారు. విరాట్స్వరూపుడైన ఆ పరమాత్మపై వారి అపారమైన భక్తి, ప్రకృతి శక్తులపై ఉన్న లోతైన అవగాహన కలిసి సూక్తాల రూపంలో వ్యక్తమయ్యాయి. అవే కాలక్రమేణా మానవాళికి మార్గదర్శకమైన వేదాంత సూత్రాలయ్యాయి.

‘సూక్తం’ అనే పదానికి మంచి మాట, సుస్పష్టంగా చెప్పబడిన వాక్యం అనే అర్థాలు ఉన్నాయి. సమగ్రంగా, తర్కబద్ధంగా నిరూపించిన బోధనను కూడా సూక్తం అని వ్యవహరిస్తారు. ఈ అన్ని అర్థాలను సమన్వయం చేస్తే, మనిషి ఆత్మోన్నతికి దోహదపడే ఉన్నతమైన మార్గదర్శక బోధనే సూక్తం అని చెప్పవచ్చు.

ప్రకృతి పరిణామక్రమం, ప్రకృతితో మనిషి కలిగి ఉండవలసిన అవగాహన, చేయవలసిన కర్తవ్యాలు, దూరంగా ఉండవలసిన చర్యలు, చివరకు సాధించవలసిన అద్వైత భావన వంటి అంశాలన్నింటినీ వేదాల్లోని సూక్తాలు విపులంగా వివరిస్తాయి. భక్తుడి మనస్సు నిశ్చలంగా ఉండటానికి, పరమాత్మపై నిరంతర లగ్నం ఏర్పడటానికి భారతీయ ఋషులు సూచించిన ప్రాథమిక సాధన వేద సూక్తాల పఠనం.

వాస్తవానికి సూక్తాలు వేదాల్లో ఒకే చోట లేదా ఒకే మంత్ర భాగంగా ఉండవు. వేదాల విభిన్న భాగాల్లో ఉన్న మంత్రాలను సంగ్రహించి, ఒక నిర్దిష్ట భావనకు రూపం ఇచ్చిన సమాహారాలే సూక్తాలు. వేదాల్లో చెప్పబడిన అత్యంత ప్రామాణికమైన సత్యాలను, మానవజాతికి అత్యవసరమైన సందేశాలుగా గ్రహించి మహర్షులు చేసిన క్రోడీకరణే ఈ సూక్తాలు.

నాలుగు వేదాల్లో వందలాది సూక్తాలు ఉన్నప్పటికీ, పురుషసూక్తం, శ్రీసూక్తం, నారాయణసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం అనే అయిదు సూక్తాలు ‘పంచసూక్తాలు’గా విశేషఖ్యాతిని పొందాయి.