శివ పురాణ కథలు అధ్యాయాల వారీగా. ఎడమవైపు అధ్యాయాన్ని ఎంచుకోండి.
నమస్కారము గురువుగారూ! తల ఎత్తి చూశాడు ధ్యానముద్రలో ఉన్న రత్నాకరుడు. ఎదురుగా నిలబడి ఉన్నారు తన శిష్యులు కృష్ణశర్మ, నారాయణభట్టు. చాలాకాలానికి వచ్చిన శిష్యులను చూసి అమితానందంతో వారిని ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత వచ్చిన పని ఏమిటి? అని అడిగాడు. గురుదేవా! ఇప్పటివరకు మీ దగ్గర అనేకమైన గ్రంథాలను తెలుసుకున్నాం. లలితా సహస్రనామాలకు భాష్యం కూడా చెప్పారు. ఇప్పుడు శివపురాణము చెప్పించుకోవాలని వచ్చాము' అన్నారు శిష్యులు.
మంచిది. ఇవ్వాల్టికి సెలవు తీసుకుని రేపు రండి' అన్నాడు రత్నాకరుడు. మరునాటి సాయంత్రం అనుకున్న ప్రకారమే వచ్చారు శిష్యులు. గురువుగారి ఎదురుగా దర్భాసనం ఆసీనులైనారు. వారిని చూసి చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. భారతదేశంలో బదిరికావనము అనే వనము ఉన్నది. అది పరమ పవిత్రమైనది. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. ఒకసారి మునులందరూ కలిసి అక్కడ ఒక యాగం చెయ్యాలి అనుకున్నారు. ఆ యాగము చూద్దామని సూతమహర్షి కూడా వచ్చాడు. ఆయన రాకకు మునులంతా మహదానందం చెందారు. ఆయనను ఉచితరీతిన సత్కరించి మహాత్మా ! శివపురాణము వినాలని మాకు చాలా కాలం నుండి కోరికగా వున్నది. కాబట్టి ఈ యాగ సమయంలో ప్రతిరోజూ మాకు శివుని లీలలను వివరించండి అని ఆర్థించారు. ఆ మాటలకు ఆనందించిన సూతుడు మునివర్యులారా పూర్వకాలంలో మార్కండేయుడికి శివ మహాత్మ్యము గూర్చి విపులంగా తెలుసుకోవాలనిపించింది. అప్పుడు సత్యలోకానికి వెళ్ళి శివుని లీలలను గూర్చి చెప్పమని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు ఈ విషయమంతా విష్ణువుకు బాగా తెలుసు అతడి దగ్గరకు వెళ్ళు అన్నాడు. వైకుంఠానికి వెళ్ళాడు మార్కండేయుడు. మార్కండేయుడు వచ్చిన పని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు మార్కండేయా! శివుని లీలలు శివునకు తప్ప ఇతరులకు తెలియవు. కాబట్టి నువ్వు కైలాసం వెళ్ళు. నీ కోరిక తీరుతుంది అన్నాడు.
మార్కండేయుడు కైలాసానికి వెళ్లి ఈశ్వరునికి నమస్కరించి స్వామీ! దేవదేవా! తమ లీలలు వినాలని వచ్చాను అన్నాడు. దానికి శంకరుడు మార్కండేయా! నా లీలలను గురించి వివరించగలవాడు నందీశ్వరుడు ఒక్కడే. వెళ్ళి అతన్ని ప్రసన్నం చేసుకో అన్నాడు. మార్కండేయుడు నందీశ్వరుని సమీపించి పరిపరివిధాల నందిని, ఈశ్వరుని స్తుతించాడు. నందీశ్వరుడు ప్రసన్నుడై, 'భక్త శిఖామణీ! నీకేం కావాలి? అని అడిగాడు. దానికి మార్కండేయుడు భక్తాగ్రగణ్యా! నాకు ఈశ్వరుని లీలలను వినాలని వున్నది. నా కోరిక తీర్చ నీవే సమర్థుడవు అన్నాడు. దానికి నందీశ్వరుడు సంతోషించి శివుని లీలలు ఒక్కొక్కటిగా చెప్పటం ప్రారంభించాడు. ఈ రకంగా శివ పురాణమంతా నందీశ్వరుడు మార్కండేయుడికి వివరించాడు అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరిస్తాడు. ముందుగా నా గురుదేవులకు నమస్కరించి, పీఠాధిపతులకు, స్వామీజీలకు, అవధూలకు వందనాలర్పించి హరితస గోత్రీకుడనైన క్రోవి పార్థసారధి అను నేను సామాన్యులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశ్యంతో, అతి సులభశైలిలో శివ పురాణాన్ని వ్రాస్తున్నాను. శివ భక్తులు, పండితులు అందరూ నా యీ ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదింతురు గాక.