భారతీయ సంస్కృతి

భారతీయ సంస్కృతి వారసత్వం, ఆత్మగుణాలు, మానవత్వపు విలువలు, పురుషార్థాలు మరియు నిత్య సత్యాలు.

ఉపోద్ఘాతం
సంస్కృతసాహిత్యం
తరతరాల వారసత్వం
ఆత్మగుణాలు
సమాజోపయోగి గుణాలు
మానవత్వపు విలువలు
దోషదూషణం
మానవతకు మహోపదేశం
పురుషార్థాలు
జీవితధ్యేయం
నిత్య సత్యాలు
ఉపసంహారం

ఉపోద్ఘాతం

నేటి మానవుని జీవితం నిన్న మొన్నటి మానవచరిత్ర ఆధారంగా నడుస్తుంది. తన గతచరిత్రను పురాతనవైభవాన్ని విస్మరించిన జాతి ప్రగతిపథంవైపు నడవనూ లేదు. అలాగే తిరోగతిపథాన్నుంచి తప్పించుకోనూ లేదు. ప్రాచీన భారతీయుల చరిత్రకు చక్కని అక్షరప్రతిరూపమే సంస్కృతసాహిత్యం. చరిత్రకందని కాలం నుంచి గల మానవజాతి మనుగడ అందులో స్పష్టంగా గోచరిస్తున్నది. ఖిలమైపోయింది పోగా దొరుకుతున్న దాన్ని కూడా ఈనాడు ఆదరించలేకపోతున్నాం. నిర్లక్ష్యం చేస్తున్నాం. రంగులు పులుముతున్నాం. ఇందువల్ల నష్టపోయేది ఎవరు? ఎవరో పరాయివాళ్లు కాదు? మనం; మన వారసులైన ముందుతరాలవాళ్లు. మరి తరతరాల నుంచి వస్తున్న ఇతర సాహిత్యాలు కూడా ఉన్నాయికదా? ఒక్క సంస్కృతభాషకే అంత ప్రాధాన్యమెందుకివ్వాలి? అనేది ఒక ప్రశ్న. సంస్కృతసాహిత్యం అతి ప్రాచీనమైంది కాబట్టి, సృష్ట్యాదినుండి మానవజాతి కల్యాణానికి అంకితమైంది కాబట్టి.