పరాశర మహర్షి చెప్పిన విష్ణు పురాణం భాగాల వారీగా. ఎడమవైపు భాగాన్ని ఎంచుకోండి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరాశరుడు మునులలో మున్నెన్నదగిన తపోధనుడు. తల్లి కడుపులో ఉన్నపుడే వేదశాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు. చిన్నతనంలోనే తపశ్శక్తిచే రాక్షససంహారం చేసినవాడు. బ్రహ్మమానస పుత్రుడైన పుల్తస్యబ్రహ్మవల్ల దివ్యజ్ఞానశక్తిని పొందినవాడు. పద్మాక్షుని పాదపద్మభక్తికి జీవితం అంకితం చేసినవాడు. దివ్యతేజోవిరాజమానుడు. ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు, వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాతకాలకృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు.
గురుదేవా! నీ అనుగ్రహంవల్ల వేదాలూ, శాస్త్రాలూ క్షుణ్ణంగా తెలుసుకున్నాను. జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడనయ్యాను. ఇంక ఒకటి. అడగాలని ఉంది. దానికి సమాధానం సర్వజ్ఞుడవైన నీవే చెప్పగలవు. చెప్పవలసిందని మనవి. అదేమిటంటే? అన్ని లోకాలలో ఆధారమై విలసిల్లే దేవుడెవరు? ఇంద్రాదులకు ప్రభువు, భక్తుల కోర్కెలు తీర్చేవాడు, చరాచర పదార్ధములందుండేవాడు, యోగీంద్ర వినుతుడు, వేదమయుడు, తన కథలచే ఇహపరసుఖమును కలిగించే దేవుడు ఎవరు? విజ్ఞానప్రదాత, భువననిర్మాత, భర్త, సంహర్త అయిన ఆ దేవుని గూర్చి తెలుసుకొనవలెనని నా కోర్కె అలాగే పృథివ్యాది భూతప్రమాణాలూ, సప్తసముద్ర విస్తారం. సప్తద్వీపవృత్తాంతం, సప్తకుల పర్వతాల విషయం, సూర్యాదిగ్రహ తారకసంచారం, దేవాదిచతుర్విధ భూతసృష్టి, చతుర్దశమన్వంతర వృత్తాంతం, నాలుగు యుగాల ప్రమాణం, కల్పవిషయం, యుగధర్మాలూ, దేవర్షుల చరిత్రలు, రాజవంశ చరిత్ర, వేదశాఖాప్రమాణాలూ, బ్రాహ్మణాది వర్ణధర్మాలూ, బ్రహ్మచర్యం మొదలుగా నాలుగాశ్రమాల పద్ధతి వినాలని ఉన్నది. సెలవియ్యవలసిందని మనవి అని అనగా పరాశరుడు పరమానంద హృదయుడై చెప్పాడు.
మైత్రేయా! మంచి విషయం అడిగావు. అదంతా నాకు తెలిసినదే. ఇప్పుడు నీవల్ల నాలోనుంచి బహిర్గతం అవుతుంది. విను. నా చిన్ననాడు ఒకప్పుడు పులస్త్య బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరముగా చూసి నువ్వు పురాణకర్తవవుతావు అని వరమిచ్చి వెళ్లిపోయాడు. ఆ వరం ప్రభావం పౌరాణిక విషయం అంతా నాకు స్వాధీనం అయింది. దానిని వివరిస్తాను విను అని అనగా మైత్రేయుడు ఆచార్యా! పురాణకర్తగా నిన్ను పులస్త్యుడు అనడానికి కారణమేమిటి? అని అడుగగా పరాశరుడు చెప్పాడు.. మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నూర్వురను దారుణముగా చంపించాడు రక్షకులచేత, మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు. అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను. వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి. కొన్నాళ్లకు జన్మించాను. పెద్దవాడనై తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది.
నీ తండ్రిని నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణముగా చంపారు. నిగ్రహించడం అనుగ్రహించడం అనే శక్తులు కలవాడవై శత్రుసంహారం చేయకపోవడం ఏమనాలి? అని నన్ను నిందాస్తుతిగా అన్నది. వెంటనే నేను అధర్వ మంత్రాలతో రాక్షస సంహారయజ్ఞం ఆరంభించాను. నా మంత్రాల ధ్వనికి లోకం అల్లలాడింది. సురలు ఆనందముగా జయధ్వనులు చేశారు. ఆ రాక్షస సంహారయజ్ఞములో లెక్కకు మిక్కిలిగా రాక్షసులు మరణించారు. చావక మిగిలినవారు మా తాత వసిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్లకి అభయం ఇచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నాడు నాయనా! పరాశరా! శాంతించు. ఏదో ఎప్పుడో జరిగింది. దాని కిప్పుడు నువ్వు ఘోరంగా యీ జీవహింసాకార్యం మునులకు దూష్యం చేయవచ్చునా? ఇలాగ చేయవలసే వారు రాజులు. ఆపు. కోపం విడువు.
జీవహింస చేసేవారికి సద్గతి రాదు. ఆ విషయం నీకు తెలియనిది కాదు. ఇంకొకమాట. ఈ పని ఆనాడు నేను చెయ్యలేనా? కన్నతండ్రిని చూస్తూ ఊరకున్నాను. కారణం? జీవహింస మునులకృత్యం కాదు. కాబట్టి. శాంతించు. కోపం పాపానికి ధూపం. ఘోరనరకకూపం. ముక్తినీ, స్వర్గమును, సంపాదించిన తపశ్శక్తిని, పుణ్యమును, యశస్సును, ధర్మమునూ పోగొట్టుతుంది. ఇక వారి వారి కర్మఫలం కష్టసుఖాలను కలిగిస్తుంది. దానికై చింత, సంతోషం పొందకూడదు. చూడు. ఏ తప్పూ చెయ్యని రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు. వారిని రక్షించు'. తాత బోధ విని శాంతించి రాక్షస మారణహోమం ముగించాను... అంతలో పులస్త్య బ్రహ్మవచ్చి మా తాతచే సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు. ఆనందించి అన్నాడు. వాసిష్ఠా! శాంతమూర్తివయావు. నీ కోరిక ఏమి? అని అడగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానం మధురమైన వాక్కు ప్రతిభ, పాండిత్యం, పురాణప్రావీణ్యం కావాలి. ప్రసాదించు! అని ప్రార్థించాను. తథాస్తు అని ఆయన వెళ్లిపోయాడు. పులస్త్యుని వాక్కు నీ కోరికను సఫలం చేయుగాక! అని మా తాత వరమిచ్చినట్టుగా ఆశీర్వదించాడు.
మైత్రేయా! ఆ మహానుభావుల అనుగ్రహంవల్ల దేవరహస్య కార్యాలూ, వేదవిద్యా విశేషాలూ, నాకు కరతలామలకా లయాయి. అనేక శాస్త్రాలూ గాన నృత్య విశేషాలూ, చరాచర భూతగణ ప్రవర్తనా నాకు వశమయాయి. వివరించి చెప్పగలను. కాబట్టి నువ్వడిగినవి పురాణరూపాన చెప్తాను విను. విష్ణువు భక్తవత్సలుడు. దేవమయుడు. దేవరక్షకుడు. విశ్వగురువు. సమస్తమూ విష్ణుమయమై నడుస్తుంది. ఆ దేవునికి సంబంధించి విష్ణుపురాణముగా చెప్తాను. అది వేదసమానముగా భావించు. శ్రద్ధగా ఆలించు! విష్ణుపురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిషంలో జ్యోతిషం, నీతిశాస్త్రాలలో నీతిశాస్త్రం, పురాణాలలో పురాణం, ఇతిహాసాలలో ఇతిహాసం, యోగవిద్యలలో యోగవిద్య, కావ్యాలలో కావ్యం, సకలలోక విషయం, సకలజనమనోరంజనం.
పరమాత్ముడైన విష్ణుని చరిత్ర గల పురాణసంహిత అది. మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయబుద్ధి విశేషముతో దక్షప్రజాపతికి చెప్పాడు. ఆయన పురుకుత్సుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు. అతని ముఖతః నేను విన్నది విన్నట్టు నీకు చెప్తాను. మైత్రేయా! నీవల్ల ఈనాడు పరమానందుడు, జగద్వంద్యుడు, మునిలోకస్తుత్యుడు, నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది. నా జన్మకృతార్థం అయింది అని వాసుదేవునకు నమస్కరించి వసిష్ఠ పులస్త్య బ్రహ్మలను మనసా స్మరించి కనులు మూసికొని ధ్యానముద్రలో భూతభవిష్యద్వర్తమానములను తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యుణ్ణి చూసి అన్నాడు. మైత్రేయా! జగములు తనలోన, జగములలో తానూ ఉన్నందువల్ల విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు.
ఆ వాసుదేవుడు అంతా తనరూపమై చరాచరము లుంటాయి. ఆయన తనరూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం. అపుడు వాసుదేవుడు కాలపురుషుడౌతాడు. కాలం వాసుదేవుని లీలారూపం. ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది. ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవు డనగా కాలపురుషు డనగా నిర్వచించి ముందు వెనకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యంకాదు. విత్తు ముందా? చెట్టుముందా? అంటే ఏది ముందు ఏది వెనుక - ఎవరు చెప్పగలరు మైత్రేయా?
ఆ వాసుదేవుని స్వరూపం కాలప్రవృత్తి. ఆ విధముగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది. ఆ విధముగా ఆకాశం శబ్దగుణకం అయింది. ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్రగుణం. ఆ స్పర్శ గుణంవల్ల వాయుతత్వం. వాయువునకు రూపం తన్మాత్రగుణం. ఆ రూపంవల్ల అగ్నితత్వం పుట్టింది. అగ్నికి రసం తన్మాత్రగుణం. ఆ రసంవల్ల జలతత్వం పుట్టింది. జలమునకు గంధం తన్మాత్రం. ఆ గంధంవల్ల పృథ్వీతత్వం పుట్టింది. పృథ్వికి శబ్దాదులైదున్నూ తన్మాత్ర గుణము లయ్యాయి. ఈ విధముగా పంచభూతాలూ తమలోని శబ్దగుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాసించడం విష్ణుభక్తిగా భావించు. పృథివ్యస్తేజో వాయ్వాకాశములనే పంచభూతాలూ, శబ్దస్పర్శరూప రసగంధపంచకం, త్వక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణములనే బుద్ధీంద్రియాలైదు. వాక్పాణిపాద పాయూపస్థలనే కర్మేంద్రియాలైదు మనోబుద్ధ్యహంకారాలతో రాజస తామస సాత్త్వికగుణాతిశయముతో ప్రజాసృష్టి విస్తరిల్లింది. ఇది ఆదిభూతవిధం. ప్రపంచ మనగా ఒక దేహం. ఆ దేహధారి లక్ష్మీవసుధార మణుడైన కేశవుడు. కాగా ఆ ప్రభువువి కానివేవీలేవు. చరాచర స్థితులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి. ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవు డయాడు.
ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను. హరినారాయణుడై పాలకడలిలో శేషశాయియై ఉన్నప్పుడు ఆతని రాజసవృత్తి సృష్టిక్రియను సాగించింది. ఒక నీటిబుడగను పోలి అండం ఒకటి ఉద్భవించింది. క్రమంగా గాఢాంధకారమునందు పెరిగింది. దానికి పైన జల, అగ్ని, వాయు, ఆకాశములు ఆవహించాయి. ఆ నాలుగు భూతాలు ఒక్కొక్కటి అయిదేసిమారులు కలియగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబికింది. ఆ అండములోంచి ఆ నారాయణుని రాజసమూర్తియై సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు.
ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్తకాగా సాత్త్వికమూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం, తామసమూర్తియైన రుద్రుడుగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాగు బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరిగాయి. ఆలాంటి నారాయణుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు ఆచార్యా! నిర్గుణుండని వేదాలు చెప్తాయి. మరి ఆ నిర్గుణమూర్తి సృష్టిస్థిత్యంతములు కలిగించడం ఎలాగా? అని అడగగా పరాశరుడు చెప్పాడు. మైత్రేయా! అదంతా ఆయనకి సహజం. అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది? ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను.