నిత్య పూజా విధానము

నిత్య పూజ, పసుపు గణపతి పూజ మరియు గణపతి, శివ, వేంకటేశ్వర, లక్ష్మీ షోడశోపచార పూజా విధానాలు.

నిత్య పూజా విధానము
పసుపు (హారిద్ర) గణపతి పూజా విధానము
మహాగణపతి షోడశోపచార పూజ విధానం
శివ షోడశోపచార పూజ విధానం
వేంకటేశ్వర స్వామి షోడశోపచార పూజ విధానం
శ్రీ లక్ష్మీ దేవి షోడశోపచార పూజ
శ్రీ కృష్ణ షోడశోపచార పూజ

నిత్య పూజా విధానము

నిత్య పూజా విధానము

పూజ ప్రారంభిచే ముందు పంచపాత్ర, ఉద్దరిణె అనగా (ఒక గ్లాసు, ఒక ఉద్దరిణె (చెంచా), ఒక ప్లేటును సిద్ధము చేసుకొవాలి).

ఏ పూజైనా ప్రారంభించే ముందు దీపమును, దూపమును (అగరవత్తులు) వెలిగించవలెను.

దీపారాధన వెలిగించి దీపమునకు కుంకుమ, పసుపు, పుష్పాదులతో అలంకరించి దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.

దీప శ్లోకము

శ్లో॥ దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపేన సర్వతమోపహః ।

దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే ॥

ఓం శ్రీ గురుభ్యోనమః

ఓం మహాగణాధిపతయే నమః

పూజా ప్రారంభము

శ్లో॥ ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే.

గమనిక :(పై శ్లోకము పఠించుచు విఘ్నేశ్వరున్ని ధ్యానించవలెను).

శ్లో॥ యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ॥

శ్లో॥ లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః

యేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ॥

శ్లో॥ ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ॥

శ్లో॥ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే

శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ॥

(ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.)

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః

ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః

ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః

ఓం శచీపురందరాభ్యాం నమః

ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః

ఓం శ్రీ సీతారామాభ్యాం నమః

॥అయం ముహూర్త స్సుముహూర్తోస్తు॥

(గ్లాసులో నీటిని తీసుకొని ఎడమ చేతిలోని ఉన్న ఉద్ధరిణె (చెంచా) తో గ్లాసులో ఉన్న నీటిని కుడి చేతిలోకి వేసుకొని ఈ క్రింది శ్లోకమును చదవవలెను).

శ్లో॥ అపవిత్రః పవిత్రోవా

సర్వావస్థాం గతోపివా।

యస్మరేత్ పుండరీకాక్షం

సబాహ్యాభ్యంతరస్శుచిః॥

ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షా

(ఈ శ్లోకము అనంతరం కుడిచేతిలో ఉన్న నీటిని తమ తలపై చల్లుకొని, ఆచమనమును చేయవలెను).

(ముందుగా కుడిచేతిని నీటితో శుభ్రము చేసుకోవలెను. తర్వాత ఉద్దరణతో నీటిని కుడిచేతిలోకి తీసుకొని 3 సార్లు ఈ క్రింది నామములతో సేవించవలెను.)

కేశవ నామములు

ఓం కేశవాయ స్వాహా (కుడి చేతిలో ఉన్న నీటిని 1వ సారి సేవించవలెను)

ఓం నారాయణాయ స్వాహా (కుడి చేతిలో ఉన్న నీటిని 2వ సారి సేవించవలెను)

ఓం మాధవాయ స్వాహా (కుడి చేతిలో ఉన్న నీటిని 3వ సారి సేవించవలెను)

(గమనిక: ఆడవారు అయినచో పైన 3 నామములు ఈ క్రింది విధముగా చదవవలెను)

ఓం కేశవాయ నమ: (కుడి చేతిలో ఉన్న నీటిని 1వ సారి సేవించవలెను)

ఓం నారాయణాయ నమ: (కుడి చేతిలో ఉన్న నీటిని 2వ సారి సేవించవలెను)

ఓం మాధవాయ నమ: (కుడి చేతిలో ఉన్న నీటిని 3వ సారి సేవించవలెను)

(4వ నామము నుంచి పురుషులు, స్త్రీలు అందరు యధావిధిగా చదవవలెను)

ఓం గోవిందాయ నమః

ఓం విష్ణవే నమః

ఓం మధుసూదనాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం వామనాయ నమః

ఓం శ్రీధరాయ నమః

ఓం హృషీకేశాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం సంకర్షణాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం ప్రద్యుమ్నాయ నమః

ఓం అనిరుద్ధాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం నారసింహాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం జనార్దనాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః

ఓం హరయే నమః

ఓం శ్రీకృష్ణాయ నమః

ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః

భూతోచ్ఛాటనము

(పసుపుతో కలిపిన 2 అక్షతలని తీసుకొని ఈ క్రింది మంత్రము చదివిన తర్వాత వాసన చూసి ఎడమ చేతి వైపు నుంచి వెనుకకి వదలవలెను).

గమనిక: ఒక వేళ జంట (భార్యాభర్తలు) కుర్చోని పూజ చేస్తున్నచో అక్షతలని తమ ధర్మపత్ని (భార్య) ఎడమ చేతి వైపు నుంచి వెనుకకు వదలవలెను.

శ్లో॥ ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ।

ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥

అథః ప్రాణాయామః

(బ్రొటన వ్రేలు, మధ్య వ్రేలు తో నాశికమును (ముక్కును) పట్టుకొని ఈ క్రింది మంత్రము చదువుతూ ప్రాణాయానమును చేయవలెను.)

ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః , ఓం సత్యం,

ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్.

ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.

(అని చదివిన తర్వాత నాశికమును (ముక్కును) వదిలివేయవలెను.)

(సంకల్పం)

(మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణా కావేరి మధ్యప్రదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర, దక్షణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి), స్వగృహే (సొంత ఇల్లు అయినచో స్వగృహే , అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అని), అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరే (తెలుగు సంవత్సరముల పేరు), దక్షిణాయనే (దక్షిణాయనే/ ఉత్తరాయనే), శరత్ ఋతౌ (ఋతువు పేరు), కార్తీక మాసే (మాసము పేరు), శుక్ల పక్షే (శుక్ల/కృష్ణ), నవమి తిధౌ (తిథి పేరు), ఆది వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శ్రీమాన్ శ్రీమత: గోత్రస్య (కుటుంబ గోత్రం), (పూజ చేయుచున్న వారి పేరు చదువుకోవాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య (పూజ చేయుచున్న వారి భార్య పేరు చదువుకోవాలి) నామధేయ: మమ సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, (మీ ఇష్టదైవము పేరు చెప్పుకోవలెను) శ్రీ పరమేశ్వర దేవతా ముద్ధిస్య శ్రీ పరమేశ్వర దేవతా పూజాం కరిష్యే.)

అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం (మీ ఇష్టదైవము పేరు చెప్పుకోవలెను) శ్రీ పరమేశ్వర దేవతా పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీటిని తాకవలెను.

తదుపరి మీ ఇష్టదైవము పూజను ప్రారంభము చేయవలెను. తదుపరి నైవేద్యం, తాంబూలం, కర్పూర నీరాజనమును సమర్పించవలెను, మంత్ర పుష్పం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారము చేయవలెను

నైవేద్యం

ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ (అంటూ కొంచెం జలమును చిలకరించి),

సత్యం త్వర్తేన పరిషం చామి (కలశములో ఉన్న నీటిని తీసుకొని మూడు సార్లు పుష్పముతో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశలో (ఎడమ నుండి కుడి వైపుకు) తిప్పి ఈ దిగువ మంత్రములతో భగవంతునికి ఆరగింపు తినిపిస్తున్నట్టు బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళతో చూపవలెను.

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా అంటూ నివేదించవలెను.

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి,అమృతమస్తు, అమృతోపస్తరణమసి, ఉత్తరాపోశనము సమర్పయామి అని నైవేద్యం దేవుని వద్ద ఉంచాలి.

తదుపరి కలశములోని నీటిని పువ్వుతో తీసుకొని హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పుకొని దేవుని పాదముల వద్ద నీటిని సమర్పించాలి. తదుపరి తాంబూలమును సమర్పించవలెను.

తాంబూలం

(తాంబూలం అనగా 3 తమలపాకులు, రెండు పండ్లు, వక్క, దక్షణ సమర్పించవలెను).

ఓం శ్రీ పరమేశ్వర దేవతాయే నమః : తాంబూలం సమర్పయామి.

నీరాజనం

ఓం శ్రీ పరమేశ్వర దేవతాయే నమః : ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).

మంత్ర పుష్పం

ఓం శ్రీ పరమేశ్వర దేవతాయే నమః : మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).

ఆత్మ ప్రదక్షిణ నమస్కారము

ఓం శ్రీ పరమేశ్వర దేవతాయే నమః : ఆత్మ ప్రదక్షిణ నమస్కారము సమర్పయామి.

తదుపరి మీ ఇష్టదైవమునకు యధాస్తానము ప్రవేశయామి అని చెప్పుకొని పూజని సంపూర్ణము చేయవలెను.

శ్రీ పరమేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి అని స్వామి వద్ద నున్న అక్షతలు తీసి తలపై వేసుకొనవలెను.