రామాయణంలోని సుందరకాండ పారాయణం — ప్రథమ, ద్వితీయ భాగాలు.
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు
అతి బలవంతుడు రామభక్తుడు
లంకకు పోయి రాగల ధీరుడు
మహిమోపేతుడు శత్రుకర్శనుడు . । 1 ।
జాంబవదాది వీరులందరును
ప్రేరేపింపగ సమ్మతించెను .
లంకేశ్వరుడు అపహరించిన
జానకీమాత జాడ తెలిసికొన . । 2 ।
తన తండ్రి యైన వాయుదేవునకు
సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు .
వానరేంద్రుడు మహేంద్రగిరి పై
వందనములిడె పూర్వాభిముఖుడై . । 3 ।
రామనామమున పరవశుడయ్యె
రోమరోమమున పులకితుడయ్యె .
కాయము పెంచె కుప్పించి యెగసె
దక్షిణ దిశగా లంక చేరగా । 4 ।
పవనతనయుని పదఘట్టనకే
పర్వతరాజము గడగడ వణకె
ఫలపుష్పాదులు జలజల రాలె
పరిమళాలు గిరిశిఖరాలు నిండె . । 5 ।
పగిలిన శిలల ధాతువులెగసె
రత్నకాంతులు నలుదిశల మెరసె .
గుహలను దాగిన భూతములదిరి
దీనారవముల పరుగిడె బెదిరి . । 6 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
రఘుకులోత్తముని రామచంద్రుని
పురుషోత్తముని పావన చరితుని .
నమ్మిన బంటుని అనిలాత్మజుని
శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని . । 7 ।
నీ కడ కొంత విశ్రాంతి దీసికొని
పూజలందుకొని పోవచ్చునని .
సగర ప్రవర్థితుడు సాగరుడెంతో
ముదమున పలికె మైనాకునితో . । 8 ।
మైనాకుడు ఉన్నతుడై నిలిచె
హనుమంతుడు ఆగ్రహమున గాంచె .
ఇదియొక విఘ్నము కాబోలునని
వారిథి బడద్రోసె ఉరముచే గిరిని . । 9 ।
పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగె
పవనతనయుని బలము గని పొంగె .
తిరిగి నిలిచె హనుమంతుని పిలిచె
తన శిఖరముపై నరుని రూపమై . । 10 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
వానరోత్తమా ఒకసారి నిలుమా
నా శిఖరాల శ్రమ దీర్చుకొనుమా .
కందమూలములు ఫలములు తినుమా
నా పూజలు గొని మన్ననలందుమా . । 11 ।
శత యోజనముల పరిమితముగల
జలనిధినవలీల దాటిపోగల
నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు
నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు . । 12 ।
పర్వతోత్తముని కరమున నిమిరి
పవనతనయుడు పలికెను ప్రీతిని
ఓ గిరీంద్రమా సంతసించితిని
నీ సత్కారము ప్రీతినందితిని . । 13 ।
రామకార్యమై యేగుచుంటిని
సాధించువరకు ఆగనంటిని .
నే పోవలె క్షణమెంతో విలువలే
నీ దీవెనలే నాకు బలములే । 14 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
అనాయాసముగ అంబరవీధిని
పయనము జేసెడు పవనకుమారుని
ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు
పులకాంకితులై ప్రస్తుతించిరి . । 15 ।
రామకార్యమతి సాహసమ్మని
రాక్షసబలమతి భయంకరమని .
కపివరుడెంతటి ఘనతరుడోయని
పరిశీలనగా పంపిరి సురసను . । 16 ।
ఎపుడో నన్ను నిన్ను మ్రింగమని
వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని .
అతిగా సురస నోటిని దెరచె
హనుమంతుడలిగి కాయము బెంచె . । 17 ।
ఒకరినొకరు మించి కాయము బెంచిరి
శత యోజనములు విస్తరించిరి .
పై నుండి సురలు తహతహలాడిరి
ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి . । 18 ।
సురస ముఖము విశాలమౌట గని
సూక్ష్మబుద్ధి గొని సమయమిదేనని
క్షణములోన అంగుష్ఠమాతృడై
ముఖము జొచ్చి వెలివచ్చె విజయుడై । 19 ।
పవనకుమారుని సాహసము గని
దీవించె సురస నిజరూపము గొని .
నిరాలంబ నీలాంబరము గనుచు
మారుతి సాగెను వేగము పెంచుచు । 20 ।
జలనిధి తేలే మారుతి ఛాయను
రాక్షసి సింహిక అట్టె గ్రహించెను
గుహను బోలు తన నోటిని దెరచెను
కపివరుని గుంజి మ్రింగజూచెను . । 21 ।
అంతట మారుతి సూక్ష్మరూపమున
సింహిక ముఖమును చొచ్చి చీల్చెను .
సింహిక హృదయము చీలికలాయెను
సాగరమున బడి అసువులు బాసెను. । 22 ।
వారిథి దాటెను వాయుకుమారుడు
లంక చేరెను కార్యశూరుడు .
నలువంకలను కలయజూచుచు
నిజ రూపమున మెల్లగ సాగుచు । 23 ।
త్రికూటాచల శిఖరముపైన
విశ్వకర్మ వినిర్మితమైన .
స్వర్గపురముతో సమానమైన
లంకాపురమును మారుతి గాంచెను . । 24 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
అనిలకుమారుడా రాత్రివేళను
సూక్ష్మరూపుడై బయలుదేరెను .
రజనీకరుని వెలుగున తాను
రజనీచరుల కనులబడకను . । 25 ।
పిల్లివలె పొంచి మెల్లగ సాగెను
ఉత్తర ప్రాకార ద్వారము జేరెను .
లంకారాక్షసి కపివరు గాంచెను
గర్జన సేయుచు అడ్డగించెను . । 26 ।
కొండ కోనల తిరుగాడు కోతివి
ఈ పురికి యే పనికై వచ్చితివి ?
లంకేశ్వరుని ఆనతి మేర
లంకాపురికి కావలి యున్నా. । 27 ।
లంకను నేను లంకాధిదేవతను
నీ ప్రాణములను నిలువున దీతును .
కదలక మెదలక నిజము పల్కుమని
లంక యెదుర్కొనె కపి కిశోరుని । 28 ।
అతి సుందరమీ లంకాపురమని
ముచ్చటపడి నే చూడవచ్చితిని .
ఈ మాత్రమునకు కోపమెందుకులే
పురము గాంచి నే మరలిపోదులే । 29 ।
అని నెమ్మదిగా పలుకగా విని
అనిలాత్మజుని చులకనగాగొని
లంకా రాక్షసి కపికిశోరుని
గర్జించి కసరి గద్దించి చరచెను . । 30 ।
సింహనాదమును మారుతి జేసె
కొండంతగ తన కాయము బెంచె .
వామ హస్తమున పిడికిలి బిగించె
ఒకే పోటున లంకను గూల్చె . । 31 ।
కొండ బండలా రక్కసి దొల్లె
కనులప్పగించి నోటిని దెరచె .
అబలను చంపుట ధర్మము
గాదని లంకను విడిచె మారుతి దయగొని । 32 ।
ఓ బలభీమా ! వానరోత్తమా !
నేటికి నీచే ఓటమెరిగితి .
ఈ నా ఓటమి లంకకు చేటని
పూర్వమే బ్రహ్మ వరమొసగెనని . । 33 ।
రావణుడాదిగ రాక్షసులందరు
సీతమూలమున అంతమొందెదరు .
ఇది నిజమౌనని మీదే జయమని
లంకారాక్షసి పంపె హరేశుని । 34 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
కోటగోడ అవలీలగ ప్రాకెను
కపికిశోరుడు లోనికి దుమికెను .
శత్రుపతనముగ వామపాదమును
ముందుగ మోపెను ముందుకు సాగెను . । 35 ।
ఆణిముత్యముల తోరణాలు గల
రమ్యతరమైన రాజవీధుల .
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరేశుడు గాంచెను । 36 ।
సువర్ణమయ సౌధరాజముల
ధగధగ మెరసే ఉన్నత గృహముల .
కళకళలాడే నవ్వుల జల్లులు
మంగళకరమౌ నృత్యగీతములు . । 37 ।
అప్సరసల మరపించు మదవతుల
త్రిస్థాయి బలుకు గానమాధురులు .
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరేశుడు గాంచెను । 38 ।
సుందరమైన హేమ మందిరము
రత్నఖచితమౌ సింహద్వారము
పతాకాంకిత ధ్వజాకీర్ణము
నవరత్నకాంతి సంకీర్ణము . । 39 ।
నృత్య మృదంగ గంభీర నాదితము
వీణాగాన వినోద సంకులము
లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరేశుడు గాంచెను । 40 ।
అత్తరు పన్నీట జలకములు
కాలాగరు సుగంధ ధూపములు .
స్వర్ణ ఛత్రములు వింజామరలు
కస్తూరి పునుకు జవాది గంధములు . । 41 ।
నిత్య పూజలు శివార్చనలు
మాస పర్వముల హోమములు .
లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరేశుడు గాంచెను . । 42 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
యమకుబేర వరుణ దేవేంద్రాదుల
సర్వసంపదల మించినది .
విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది
బ్రహ్మవరమున కుబేరుడందినది । 43 ।
రావణుండు కుబేరుని రణమందు
ఓడించి లంకకు గొని తెచ్చినది .
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందె . । 44 ।
నేలను తాకక నిలచియుండునది
రావణ భవన మధ్యంబుననున్నది .
వాయుపథమున ప్రతిష్ఠితమైనది
మనమున దలచిన ప్రీతిపోగలది . । 45 ।
దివినుండి భువికి దిగిన స్వర్గమది
సూర్యచంద్రులను ధిక్కరించునది .
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందె . । 46 ।
లంకాధీశుని ప్రేమ మందిరము
రత్నఖచితమౌ హేమ మందిరము .
చందనాది సుగంధ బంధురము
పానభక్ష్య పదార్థ సమృద్ధము . । 47 ।
ఆయా పరిమళ రూపానిలము
అనిలాత్మజుచే ఆఘ్రాణితము .
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె . । 48 ।
మత్తున శయనించు సుదతుల
మోములు పద్మములనుకొని
మూగు భ్రమరములు .
నిమీలిత విశాల నేత్రములు
నిశాముకుళిత పద్మపత్రములు . । 49 ।
ఉత్తమ కాంతల గూడి రావణుడు
తారాపతి వలె తేజరిల్లెడు .
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె . । 50 ।
రావణుండు రణమందున గెలిచి
స్త్రీలెందరినో లంకకు జేర్చెను
పితృ దైత్య గంధర్వ కన్యలు
ఎందెందరో రాజర్షి కన్యలు . । 51 ।
సీత తక్క వారందరు కన్యలె
రావణుమెచ్చి వరించిన వారలె .
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె . । 52 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
ఐరావతము దంతపు మొనలతో
పోరున బొడిచిన గంటులతో
వజ్రాయుధపు ప్రఘాతములతో
చక్రాయుధపు ప్రహరణములతో . । 53 ।
జయపరంపరల గురుతులతో
కీర్తి చిహ్నముల కాంతులతో
లంకేశుడు శయనించె కాంతలతో
సీతకై వెదకె మారుతి ఆశతో । 54 ।
మినప రాశి వలె నల్లని వాడు
తీక్షణ దృక్కుల లోహితాక్షుడు .
రక్తచందన చర్చిత గాత్రుడు
సంధ్యారుణ ఘన తేజోవంతుడు . । 55 ।
సతులగూడి మధు గ్రోలిన వాడు
రతికేళి సలిపి సోలిన వాడు .
లంకేశుడు శయనించె కాంతలతో
సీతకై వెదకె మారుతి ఆశతో । 56 ।
అందొక వంక పర్యంకము జేరి
నిదురించుచుండె దివ్యమనోహరి .
నవరత్నఖచిత భూషణధారిణి
నలువంకలను కాంతి ప్రసారిణి . । 57 ।
స్వర్ణదేహిని చారురూపిణి
రాణులకు రాణి పట్టపురాణి .
లంకేశ్వరుని హృదయేశ్వరి
మందోదరి లోకోత్తర సుందరి . । 58 ।
మందోదరిని జానకి యనుకొని
ఆడుచు పాడుచు గంతులు పెట్టి .
వాలము బట్టి ముద్దులు పెట్టి
నేలను గొట్టి భుజములు తట్టి . । 59 ।
స్తంభములెగసి క్రిందకు దుమికి
పల్లటీలు గొట్టి ఛెంగున జుట్టి
చంచలమౌ కపిస్వభావమును
పవనతనయుడు ప్రదర్శన జేసెను . । 60 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
రాముని సీతా యిటులుండునా ?
రావణు జేరి శయనించునా ?
రాముని బాసి నిదురించునా ?
భుజయించునా భూషణముల దాల్చునా ? । 61 ।
పరమపురుషుని రాముని మరచునా ?
పరపురుషునితో కాపురముండునా ?
సీత కాదు కాదు కానేకాదని
మారుతి వగచుచు వెదకసాగెను । 62 ।
పోవగరాని తావుల బోతి
చూడగరానివి యెన్నో జూచితి
నగ్నముగా పరున్న పరకాంతల
పరిశీలనగా పరికించితిని . । 63 ।
రతికేళి సలిపి సోలిన రమణుల
ఎందెందరినో పొడగాంచితిని .
ధర్మము గానని పాపినైతినని
పరితాపముతో మారుతి కృంగెను . । 64 ।
సుదతుల తోడ సీతయుండగా
వారల జూడక వెదకుటెలాగ ?
మనసున యేమి వికారమునొందక
నిష్కామముగ వివేకము వీడక । 65 ।
సీతను వెదకుచు చూచితి గాని
మనసున యేమీ పాపమెరుగనని .
స్వామి సేవ పరమార్థముగా గొని
మారుతి సాగెను సీత కోసమని । 66 ।
భూమీగృహములు నిశాగృహములు
క్రీడాగృహములు లతాగృహములు .
ఆరామములు చిత్రశాలలు
బావులు తిన్నెలు రచ్చవీధులు . । 67 ।
మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్లు
సందులు గొందులు బాటలు తోటలు .
ఆగి ఆగి అడుగడుగున వెదకుచు
సీతను గానక మారుతి వగచె । 68 ।
సీతామాత బ్రతికి యుండునో
కౄర రాక్షసుల పాల్పడి యుండునో ?
తాను పొందని సీత యెందుకని
రావణుడే హతమార్చి యుండునో ? । 69 ।
అని యోచించుచు అంతట వెదకుచు
తిరిగిన తావుల తిరిగి తిరుగుచు .
ఆగి ఆగి అడుగడుగున వెదకుచు
సీతను గానక మారుతి వగచె । 70 ।
సీత జాడ కనలేదను వార్తను
తెలిపిన రాముడు బ్రతుకజాలడు .
రాముడు లేనిదె లక్ష్మణుడుండడు
ఆపై రఘుకులమంతయు నిశించు . । 71 ।
ఇంతటి ఘోరము కాంచినంతనె
సుగ్రీవాదులు మడియక మానరు
అని చింతించుచు పుష్పకము
వీడి మారుతి చేరె ప్రాకారము పైకి . । 72 ।
ఇంత వినాశము నా వల్లనేను
నే కిష్కింధకు పోనే పోను .
వానప్రస్థాశ్రమవాసుడనై
నియమ నిష్ఠలతో బ్రతుకువాడనై . । 73 ।
సీతామాతను చూచితీరెదను
లేకున్న నేను అగ్ని దూకెదను .
అని హనుమంతుడు కృత నిశ్చయుడై
నలుదెసల గనె సాహసవంతుడై . । 74 ।
చూడ మరచిన అశోక వనమును
చూపు మేరలో మారుతి గాంచెను .
సీతారామ లక్ష్మణాదులకు
ఏకాదశ రుద్రాది దేవులకు . । 75 ।
ఇంద్రాది యమ వాయుదేవులకు
సూర్యచంద్ర మరుద్గణములకు
వాయునందనుడు వందనములిడి
అశోకవని చేరెను వడివడి । 76 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
విరితేనియలు గ్రోలు భృంగములు
విందారగ సేయు ఝంకారములు .
లేజివురాకుల నెసవు కోయిలలు
పంచమ స్వరముల పలికే పాటలు । 77 ।
పురులు విప్పి నాట్యమాడు
నెమళులు కిలకిలలాడే
పక్షుల గుంపులు సుందరమైన
అశోకవనమున మారుతి
వెదకెను సీతను కనుగొన । 78 ।
కపికిశోరుడు కొమ్మకొమ్మను
ఊపుచు ఊగుచు దూకసాగెను .
పూవులు రాలెను తీవెలు తెగెను
ఆకులు కొమ్మలు నేలపై బడెను । 79 ।
పూలు పై రాల పవనకుమారుడు
పుష్పరథము వలె వనమున దోచెడు .
సుందరమైన అశోకవనమున
మారుతి వెదకెను సీతను కనుగొన । 80 ।
పూవులనిన పూతీవియలనిన
జానకికెంతో మనసౌనని .
పద్మపత్రముల పద్మాక్షుని
గన పద్మాకరముల కొంతె జేరునని । 81 ।
అన్ని రీతులా అనువైనదని
అశోకవని సీత యుండునని .
శోభిల్లు శింశుపా తరుశాఖలపై
మారుతి కూర్చొని కలయజూచెను . । 82। ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
సుందరమైన అశోకవనమున
తను కూర్చొనిన తరువు క్రిందున
కృంగి కృశించిన సన్నగిల్లిన
శుక్లపక్షపు చంద్రరేఖను . । 83 ।
ఉపవాసముల వాడిపోయిన
నివురు గప్పిన నిప్పు కణమును .
చిక్కిన వనితను మారుతి గాంచెను
రాక్షస వనితల కౄర వలయమున . । 84 ।
మాసిన పీతవసనమును దాల్చిన
మన్నున పుట్టిన పద్మమును .
పతి వియోగ శోకాగ్ని వేగిన
అంగారక పీడిత రోహిణిని . । 85 ।
మాటిమాటికి వేడి నిట్టూర్పుల
సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను .
చిక్కిన వనితను మారుతి గాంచెను
రాక్షస వనితల కౄర వలయమున . । 86 ।
నీలవేణి సంచాలిత జఘనను
సుప్రతిష్టను సింహమధ్యను
కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను
రతీదేవి వలె వెలయు కాంతను । 87 ।
పుణ్యము తరిగి దివి నుండి జారి
శోక జలధి పడి మునిగిన తారను .
చిక్కిన వనితను మారుతి గాంచెను
రాక్షస వనితల కౄర వలయమున । 88 ।
పతి చెంతలేని సతికేలనని
సీత సొమ్ముల దగిల్చె శాఖల .
మణిమయ కాంచన కర్ణవేష్ఠములు
మరకత మాణిక్య చంపసరాలు । 89 ।
రత్నఖచితమౌ హస్త భూషలు
నవరత్నాంకిత మణిహారములు
రాముడు దెలిపిన గురుతులు
గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి । 90 ।
సర్వ సులక్షణ లక్షిత జాత
సీతగాక మరి యెవరీ మాత ?
కౌసల్యా సుప్రజారాముని
సీతగాక మరి యెవరీ మాత ? । 91 ।
వనమున తపించు మేఘశ్యాముని
సీతగాక మరి యెవరీ మాత ?
ఆహా కంటి కనుగొంటి సీతనని
పొంగి పొంగి ఉప్పొంగె మారుతి . । 92 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
పూవులు నిండిన పొలములందున
నాగేటిచాలున జననమందిన
జనక మహారాజు కూతురైన
దశరథ నరపాలు కోడలైన . । 93 ।
సీతాలక్ష్మికి కాదు సమానము
త్రైలోక్యరాజ్య లక్ష్మీ సహితము .
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచె సీతను కనుగొని । 94 ।
శత్రుతాపకరుడు మహాశూరుడు
సౌమిత్రికి పూజ్యురాలైన
ఆశ్రితజన సంరక్షుడైన
శ్రీరఘురాముని ప్రియసతి యైన . । 95 ।
పతి సన్నిధియే సుఖమనియెంచి
పదునాల్గేండ్లు వనమునకేగిన .
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచె సీతను కనుగొని । 96 ।
బంగరు మేని కాంతులు మెరయ
మందస్మిత ముఖ పద్మము విరియ .
హంసతూలికా తల్పమందున
రాముని గూడి సుఖింపగ తగిన । 97 ।
పురుషోత్తముని పావనచరితుని
శ్రీరఘురాముని ప్రియసతి యైన .
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచె సీతను కనుగొని . । 98 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
మూడు ఝాముల రేయి గడువగా
నాల్గవ ఝాము నడచుచుండగా .
మంగళవాద్య మనోహర ధ్వనులు
లంకేశ్వరుని మేలుకొలుపులు । 99 ।
క్రతువులొనర్చు షడంగవేదవిదుల
స్వరయుగ శబ్దతరంగ ఘోషలు
శోభిల్లు శింశుపా శాఖలందున
మారుతి కూర్చొని ఆలకించెను . । 100 ।
రావణాసురుడు శాస్త్రోక్తముగా
వేకువనే విధులన్ని యొనర్చెను .
మదోత్కటుడై మదనతాపమున
మరిమరి సీతను మదిలో నెంచెను . । 101 ।
నూర్గురు భార్యలు సురకన్యల వలె
పరిసేవింపగ దేవేంద్రుని వలె .
దశకంఠుడు దేదీప్యమానముగ
వెడలెను అశోకావనము చేరగా । 102 ।
లంకేశునితో వెడలిరి సతులు
మేఘము వెంట విద్యుల్లతల వలె .
మధువు గ్రోలిన పద్మముఖుల
ముంగురులు రేగె భృంగముల వలె . । 103 ।
క్రీడల తేలిన కామినీమణుల
నిద్రలేమి పడు అడుగులు తూలె .
దశకంఠుడు దేదీప్యమానముగ
చేరెను అశోకావనము వేగముగ । 104 ।
లంకేశుని మహా తేజమును గని
మారుతి కూడ విభ్రాంతి జెందెను .
దశకంఠుడు సమీపించి నిలిచెను
సీతపైననే చూపులు నిలిపెను . । 105 ।
తొడలు చేర్చుకొని కడుపును దాచి
కరములు ముడిచి చనుగన దాచి
సుడిగాలి పడిన కదళీ తరువు వలె
కటిక నేలపై జానకి తూలె । 106 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
ఓ సీతా ! ఓ పద్మనేత్రా !
నా చెంత నీకు యేల చింత ?
ఎక్కడి రాముడు ? ఎక్కడి అయోధ్య ?
ఎందుకోసమీ వనవాస వ్యథ ? । 107 ।
నవయవ్వన త్రిలోకసుందరీ
నీకెందుకు యీ మునివేషధారి ?
అని రావణుడు కామాంధుడై
నిలిచె నోటికి వచ్చినదెల్ల పలికె . । 108 ।
రాముడు నీకు సరిగానివాడు
నిను సుఖపెట్టడు తను సుఖపడడు.
గతిచెడి వనమున తిరుగుచుండెనో
తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో । 109 ।
మరచిపొమ్ము ఆ కొరగాని రాముని
వలచి రమ్ము నను యశోవిశాలుని .
అని రావణుడు కామాంధుడై
నిలిచె నోటికి వచ్చినదెల్ల పలికె .। 110 ।
రాముడు వచ్చుట నన్ను గెల్చుట
నిన్ను పొందుట కలలోని మాట .
బలవిక్రమ ధన యశములందున
అల్పుడు రాముడు నా ముందెందున । 111 ।
యమ కుబేర ఇంద్రాది దేవతల
గెలిచిన నాకిల నరభయమేల ?
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె . । 112 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
నిరతము పతినే మనమున దలచుచు
క్షణమొక యుగముగ కాలము గడుపుచు
రావణ గర్వమదంబుల ద్రుంచు
రాముని శౌర్యధైర్యముల దలచుచు । 113 ।
శోకతప్తయై శిరమును వంచి
తృణమును ద్రుంచి తన ముందుంచి .
మారు పల్కె సీత దీనస్వరమున
తృణముకన్న రావణుడే హీనమన . । 114 ।
రామలక్ష్మణులు లేని సమయమున
అపహరించితివె నను ఆశ్రమమున .
పురుష సింహముల గాలికి బెదిరి
పారిపోతివి శునకము మాదిరి . । 115 ।
యమ కుబేర ఇంద్రాది దేవతల
గెలిచిన నీకీ వంచనలేల ?
అని పల్కె సీత దీన స్వరమున
తృణముకన్న రావణుడే హీనమన । 116 ।
ఓయి రావణా ! నా మాట వినుము
శ్రీరామునితో వైరము మానుము .
శీఘ్రముగా నను రాముని జేర్చుము
త్రికరణ శుద్ధిగా శరణు వేడుము । 117 ।
నిను మన్నించి అనుగ్రహింపుమని
కోరుకొందు నా కరుణామూర్తిని .
అని పల్కె సీత దీన స్వరమున
తృణముకన్న రావణుడే హీనమన । 118 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
ఓ సీతా ! నీవెంత గడసరివె
ఎవరితో యేమి పల్కుచుంటివె ?
ఎంతటి కర్ణ కఠోర వచనములు
ఎంతటి ఘోర అసభ్య దూషణలు . । 119 ।
నీపై మోహము నను బంధించెను
లేకున్న నిను వధించియుందును .
అని గర్జించెను ఘనతరగాత్రుడు
క్రోధోద్దీప్తుడై దశకంఠుడు . । 120 ।
నీకొసగిన ఏడాది గడువును
రెండు నెలలలో తీరిపోవును .
అంతదనుక నిన్నంటగ రాను
ఈలోపున బాగోగులు కనుగొను .। 121 ।
నను కోరని నిను బలాత్కరించను
నను కాదను నిను కనికరించను .
అని గర్జించెను ఘనతరగాత్రుడు
క్రోధోద్దీప్తుడై దశకంఠుడు . । 122 ।
ఓ రావణా ! నీ క్రొవ్విన నాలుక
గిజగిజలాడి తెగిపడదేమి ?
కామాంధుడా నీ కౄర నేత్రములు
గిర గిర తిరిగి రాలిపడవేమి ? । 123 ।
పతియాజ్ఞ లేక యిటులుంటి గాని
తృటిలో నిన్ను దహింపనా యేమి ?
అని పల్కె సీత దివ్య స్వరమున
తృణముకన్న రావణుడే హీనమన। 124 ।
క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు
కొరకొర జూచుచు నిప్పులు గ్రక్కుచు
తన కాంతలెల్ల కలవరమొందగ
గర్జన సేయుచు దిక్కులదరగ . । 125 ।
సీతనెటులైన వొప్పించుడని
వొప్పుకొననిచో భక్షించుడని .
రావణాసురుడు అసురవనితలను
ఆజ్ఞాపించి మరలిపోయెను । 126 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
అందున్న వొక వృద్ధ రాక్షసి
తోటి రాక్షసుల ఆవల ద్రోసి
కావలెనన్న నన్ను వేధింపుడు
సీతను మాత్రము హింసింపకుడు . । 127 ।
దారుణమైన కలగంటి నేను
దానవులకది ప్రళయమ్మేను
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . । 128 ।
శుక్లాంబరములు దాల్చినవారు
రామలక్ష్మణులు అగుపించినారు .
వైదేహికి యిరువంకల నిలచి
దివ్యతేజమున వెలుగొందినారు . । 129 ।
తెల్లని కరిపై మువ్వురు కలసి
లంకాపురిపై పయనించినారు .
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . । 130 ।
దేవతలందరు పరిసేవింప
ఋషిగణంబులు అభిషేకింప .
గంధర్వాదులు సంకీర్తింప
బ్రహ్మాదులు మునుముందును దింప । 131 ।
సీతారాముడు విష్ణుదేవుడై
శోభిల్లెను కోటి సూర్య తేజుడై .
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము । 132 ।
తైలమలదుకొని రావణాసురుడు
నూనె త్రాగుచూ అగుపించినాడు .
కాలాంబరమును ధరియించినాడు
కరవీరమాల దాల్చినాడు . । 133 ।
పుష్పకమందుండి నేలబడినాడు
కడకొక స్త్రీచే యీడ్వబడినాడు
అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . । 134 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .
రావణుండు వరాహముపైన
కుంభకర్ణుడు ఒంటెపైన .
ఇంద్రజిత్తు మకరముపైన
దక్షిణ దిశగా పడిపోయినారు । 135 ।
రాక్షసులందరు గుంపుగుంపులుగ
మన్నున కలిసిరి సమ్మూలమ్ముగ .
అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము । 136 ।
తెల్లని మాలలు వలువలు దాల్చి
తెల్లని గంధము మేన బూసికొని .
నృత్య మృదంగ మంగళ ధ్వనులతో
చంద్రకాంతులెగజిమ్ము ఛత్రముతో . । 137 ।
తెల్లని కరిపై మంత్రివర్యులతో
వెడలె విభీషణుడు దివ్యకాంతితో .
అని తెల్పె త్రిజట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసీ గణము . । 138 ।
విశ్వకర్మ నిర్మించిన లంకను
రావణుండు పాలించెడు లంకను .
రామదూత వొక వానరోత్తముడు
రుద్రరూపుడై దహియించినాడు . । 139 ।
ప్రళయ భయానక సదృశమాయెను
సాగరమున లంక మునిగిపోయెను
అని పల్కు త్రిజట మాటలు వినుచు
నిద్రతూగిరి రాక్షస వనితలు । 140 ।
హృదయ తాపమున జానకి తూలుచు
శోకభారమున గడగడ వణకుచు .
జరిగి జరిగి అశోక శాఖలను
ఊతగాగొని మెల్లగ నిలచి । 141 ।
శ్రీరాముని కడసారి తలచుకొని
తన మెడజడతో వురిపోసుకొని .
ప్రాణత్యాగము చేయబూనగా
శుభ శకునములు తోచె వింతగా । 142 ।
సీతకెంత దురవస్థ ఘటిల్లె
నా తల్లినెటుల ఊరడించవలె ?
నన్ను నేనెటుల తెలుపుకోవలె
తల్లినెటుల కాపాడుకోవలె ? । 143 ।
యే మాత్రము నే ఆలసించినా
సీతామాత ప్రాణములుండునా ?
అని హనుమంతుడు శాఖలమాటున
తహతహలాడుచు మెదలసాగెను । 144 ।
నను గని జానకి బెదరక ముందే
పలికెద సీతారామ కథ .
సత్యమైనది వ్యర్థము గానిది
పావనమైనది శుభకరమైనది । 145 ।
సీతా మాతకు కడు ప్రియమైనది
పలుకు పలుకున తేనెలొలుకునది .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . । 146 ।
దశరథ విభుడు రాజోత్తముడు
యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు .
దశరథునకు కడు ప్రియమైన వాడు
జ్యేష్ఠ కుమారుడు శ్రీరఘురాముడు . । 147 ।
సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు
పితృవాక్య పరిపాలన శీలుడు .
అని హనుమంతుడు
మృదుమధురముగా పలికెను సీతారామ కథ . । 148 ।
శ్రీ రాముని పట్టాభిషేకము
నిర్ణయమైన శుభసమయమున
చిన్న భార్య కైక దశరథు చేరి
తనకొసగిన రెండు వరములు కోరె . । 149 ।
భరతునకు పట్టాభిషేకముపదునాల్గేండ్లు
రామ వనవాసము అని హనుమంతుడు
మృదుమధురముగా పలికెను
సీతారామ కథ . । 150 ।
శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .