← అన్ని పండుగలు

రథసప్తమి ప్రాముఖ్యత

రథసప్తమి పర్వదినము రోజున ప్రాతః కాలమున అనగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని, స్నానాదికాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి, మామిడి తోరణములతో ఇంటిని అలంకరించాలి. ఆ తర్వాత దైవానికి పుష్పార్చన,అర్ఘ్యం,ధూప దీపాదులను సమర్పించి ఆవుపాలతో పొంగలి చేసి, చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి సూర్య భగవానునికి నివేదన ఇవ్వాలి.

రథసప్తమి

లోక సాక్షి ఐన ఆసూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సప్తమే మాఘ శుద్ధ సప్తమి. అదే సూర్య భగవానుని జన్మతిధి "రథసప్తమి".


ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనం ఏడు గుర్రముల బంగారు రథం మీద సాగుతుందని వేదము. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము "రథసప్తమి" అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.


మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజు అరుణోదయవేళ స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలనిచ్చును. సప్తమి నాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్టీ, సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.


రథసప్తమి నాడు బంగారము గాని, వెండి గాని, రాగి గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుత భారతీయతకు చిహ్నము.


సూర్య జయంతి :


ఆదిత్యార్చన అద్భుత శక్తి. పవిత్ర మాఘమాసం మహిమాన్వితం. ఈ మాసంలో అన్ని శుభ దినాలే. మాఘమాసంలో చేసే స్నానం, దేవతార్చన అనంత పుణ్యఫలాలు ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమిగా, సూర్యజయంతిగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామి నిజరూపాన్ని దర్శించుకోవడం భక్తులు మరపురాని మధురానిభూతిగా భావిస్తారు. రథసప్తమి రోజున అర్ధరాత్రి నుంచే అరసవల్లిలో భక్తుల సందడితో ఆదిత్యుని జయంత్యుత్సవాల సందడి కనిపిస్తుంది.


ఆరోగ్య ప్రదాత:


మాఘశుద్ధ సప్తమి రోజున అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించి, సేవించడం ద్వారా రోగ, శోక, దారిద్య్రాలు పోతాయని భక్తుల నమ్మకం. అందుకే రథసప్తమి రోజున భక్తులు స్వామివారి నిజ రూప దర్శనం, మహా క్షీరాభిషేకం సేవలో పాల్గొని తరిస్తారు. మాఘశుద్ధ సప్తమి వేకువ జామున ఆకాశంలో నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడుతుంటాయని, ఉత్తరాయణంలో వచ్చే చర్మ, కుష్ఠి, బొల్లి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే సూర్యారాధన చేయాలని పెద్దలు వివరించారు.


అరుణశిల అత్యద్భుతం :


ఆదిత్యాలయంలో రథసప్తమి రోజున శ్రీసూర్యనారాయణస్వామి నిజరూప దర్శనం భక్తులకు మరపురాని మధురానిభూతి కలిగిస్తుంది. అరుణశిల దర్శించినంత మాత్రానే అద్భుతశక్తి శరీరంలోకి ప్రవేశించిన భావన కలుగుతుంది. ఆదిత్యాలయంలోని అయిదున్నర అడుగుల అరుణశిలతో దేవశిల్పి విశ్వకర్మ స్వామి మూలవిరాట్‌ను చెక్కినట్లు పురాణాలు చెబుతున్నాయి. మూలవిరాట్‌ కిందన వైజయంతి సప్త అశ్వరథం ఉంటుంది. రథంపై గుర్రాలు తాళ్లు పట్టుకుని సూర్య రథసారథి అనూరుడు ఉంటారు. స్వామి పాదాల ముందర ఛాయాదేవి, స్వామి ఎడమవైపు, కుడివైపు ఉషా, పద్మినిదేవి ఉంటారు. ముగ్గురు దేవేరుల్లో ఉషా, పద్మిని ధనుస్సులు ధరించి ఉంటారు. స్వామికి ఎడమవైపున ద్వారపాలకుడైన మాఠరుడు కత్తి, డోలు ధరించి ఉంటాడు. స్వామికి కుడివైపున చిన్న గడ్డంతో కూడిన పింగళుడు ఎడమవైపు సిరాబుడ్డీ, కుడిచేతిలో కలం పట్టుకుని ఉంటాడు. ఈయనే భక్తులు చేసే విన్నపములను, కోరికలు స్వీకరించి స్వామికి నివేదిస్తారు. స్వామికి శిరస్సుకు ఎడమవైపు సనకుడు ఛత్రంలోను, కుడివైపున సనందుడు అనే మహర్షి ఛామరం పట్టుకుని సేవలు అందిస్తారు. స్వామికి రెండు చేతులు అభయ ముద్రలలో ఉంటాయి. స్వామి భుజాలకు ఇరువైపుల తామరపూలు, మొగ్గులను ధరించి ఉంటారు. సూర్యనారాయణ స్వామి మెడలో హారాలు, మకర కుండలాలు, కేయూరాలు, రత్నఖచిత సూర్యమణి కిరీటంతో చిరునవ్వుతో స్థానక భంగిమలో భక్తులకు స్వామి దర్శనం ఇస్తుంటారు. స్వామి శిరస్సు మీద శరభ సాల్వం అనే పతాక చిహ్నం ఉంటుంది.


పాయసాన్నం పరమౌషధం :

రథసప్తమి రోజున ప్రాతః కాలమున కొత్తబెల్లం, కొత్తబియ్యం, ఆవుపాలతో పాయాసాన్నం చేసి స్వామికి నివేదించి ప్రసాధాన్ని స్వీకరించినట్లైతే నరాలు, కీళ్ల నొప్పులు, హృద్రోగ సంబంధ వ్యాధులు నశిస్తాయి. స్వామికి సమర్పించిన తీపి పదార్థంపై లేత సూర్యకిరణాలు పడడం వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగి, మధుమేహవ్యాధిని తగ్గిస్తుంది. పాయాసన్నంలో వాడే చెరకు వల్ల పళ్లు, దవడలు, నరాలకు శక్తి వస్తుంది. రథసప్తమి రోజు నదులు, చెరువుల్లో దీపం వదిలివేస్తే మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. జిల్లేడు ఆకులు శిరస్సున, రెండు భుజాలపైన రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మల రోగాల పోయి, మనస్సు, నవరంధ్రాలు, పంచేంద్రియాలు సుషుప్తావస్థ నుంచి జాగృతావస్థలోకి వస్తాయని చెబుతారు. రథసప్తమి రోజున స్వామి నిజరూప దర్శనం వల్ల అభిషేకం చేసిన అరుణశిల కిరణాల స్పర్శతో భక్తులకు రోగ నివారణ కలుగుతుందని నమ్ముతారు.