తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు.

ఈ పండుగను నాలుగు రోజులు జరుపుకుంటారు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గాను, రెండో రోజును 'మకర సంక్రాంతి'గాను, మూడో రోజును 'కనుమ'గాను పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' గాను పిలుస్తారు.
సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే సమయం. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పాత పనికిరాని బట్టలను, వస్తువులను వేసి పీడలను,అరిష్టాలను తొలగించుకుంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట ఇచ్చి భవగత్ సన్నిదిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది.
భోగి రోజున బొమ్మల కొలువు, పేరంటము కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రేకులు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. భోగిపండ్లను పిల్లల తల మీద పోయడం వలన శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.
రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. పురాణ కధనము ప్రకారం శివుణ్ని ప్రసన్నము చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.
భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.
సంక్రాంతి అంటే కొత్త వెలుగులు. ముఖ్యంగా సంక్రాంతి రోజున గాలిపటాల వేడుక నిర్వహించడం అనేది సాంప్రదాయము. ఈ పండుగను పూర్వం మన పెద్దలు దాదాపు 33 రోజలపాటు ఘనంగా జరుపుకునేవారు.కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండుగను 4 రోజులపాటు మాత్రమే నిర్వహించుకుంటున్నారు. అయితే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి సాగరులకు శాప విమోచనం చేయించింది ఈ రోజే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే పండుగ వాతావరణం కనిపిస్తుంది. మకర సంక్రమణం అంటే పాత పోయి కొత్తదనానికి స్వాగతం పలికే రోజు అని అర్థం. ఈ పర్వదినాలలో విష్ణు మూర్తిని ఆరాధిస్తాం.
సంక్రాంతి పండుగకు పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది. దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్ళలో కళ్లాపి చల్లి, ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులను నింపి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షరూపం సూర్యభగవానుడు. సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి, సూర్యభగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్యహృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి.
ఈ పండుగ రోజున గడపకు పసుపు రాసి, కుంకుమ పెట్టి, వాకిట్లో ముగ్గులు వేసి వాటిలో ఆవు పేడ గొబ్బెమ్మలు పెట్టడం, ఇంట్లో పిండివంటలు, పరమాన్నం చేసి శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.ఈ రోజు గాలి పటాలను ఎగుర వేయటం, ఆడవారు ముగ్గులు వేయటం, ముగ్గుల పోటీలు జరుపుకోవటం చేస్తారు.
అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తరువాత అయ్యప్పను, మకర జ్యోతిని కూడా ఈ రోజే దర్శించుకుంటారు.
ఈ కనుమ రోజున పశువులను లక్ష్మి స్వరూపాలుగా భావించి, అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం వలన ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు. సంక్రాంతిని సాగనంపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది.
కొన్ని ప్రాంతాలలోని ప్రజలు నాలుగో రోజు 'ముక్కనుమను' కూడా జరుపుకుంటారు.