← అన్ని పండుగలు

మహా శివరాత్రి ప్రాముఖ్యత

భారతీయ తెలుగు సాంప్రదాయ పండగలన్నీ తిధులతోను,నక్షత్రాములతోను ముడిపడి ఉంటాయి.కొన్ని పండగలకు తిధులు,మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణ పక్షములోని ప్రదోష వ్యాప్తిగల చతుర్ధశి తిధిని మాసశివరాత్రి అంటారు.ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివున్ని కొలుస్తారు.

మహా శివరాత్రి

మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్నరోజును మహాశివరాత్రిగా పరిగణింపబడినదని శాస్త్ర వచనం. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము.


సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి.అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము.మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినము. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిదర పోకుండా జాగరణతో మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు.


ఇది హిందువులకు అత్యంత పుణ్య ప్రదమైన రోజు.మహశివరాత్రిని హిందువులు ఏంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివున్ని కొలిచి తరిస్తారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు.


1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.


శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి గల కారణము:


శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కధ ఉంది.ఒకానోక రోజు బ్రహ్మ,విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారీరువురిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవలనుకున్నారు.ఈ విషయంలో వాదన తారాస్థాయికి చేరింది.


ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘ మాస చతుర్ధశి తిధి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ,విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆశివుని యొక్క ఆది,అంతం తెలుసుకోవలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు.మరోవైపు బ్రహ్మ తన హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు.


వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు,చివర ఎదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు.చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోప వాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు.అపుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు.ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కధనం.


శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్రవిధులు :-


మహా శివరాత్రి రోజు భ్రాహ్మీ మూహూర్తంలో నిద్రలేచి ఇల్లాంత శుభ్రపరచుకుని శుచిగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి.గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి.పూజగదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో,ఆవుపాలతో,పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో,పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను,బిల్వపత్రాలను,తుమ్మిపూలను,గోగుపూలు,తెల్లని,పచ్చని పూలతో శివనామాలను కాని పంచాక్షరీ మంత్రమైన ఓం నమశ్శివాయ అని స్మరిస్తూ పూజించాలి.


తాంబూలం, అరటి పండు,జామపండు,ఖర్జూరపండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్టతో శివ అష్టోత్తరం/పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి.ప్రాత:కాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు,సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి.శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో కనుక శివున్నిఅభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. శివుడు అభిషేక ప్రియుడు.స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివున్ని బోళాశంకరుడని పేరు.


సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివ నామాలను,శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభఫలితాలు పొందుతారు. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించు కుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోర్కెలను తీరుస్తూ రక్షించుకుంటాడు.ఈ మహా శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంత జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాస దీక్ష విరమణగావించాలి. ఈ పద్దతులలో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు.


శివుని గొప్పతనాన్ని తెలిపిన ఋగ్వేదం :


వేదాలు, ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యమైనవి. వీటిలో ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. శివస్వరూపం అత్యంత మంగళకరమైనది. ఆ పరమ శివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. పురాణాలలో తెలియజేసిన మహా శివరాత్రిని ఏటా మాఘమాసం కృష్ణపక్ష చతుర్థశినాడు జరుపుకుంటాం.


మహాశివరాత్రి శ్రీ శైలంలో ఏ రోజు నిర్వహిస్తారో ఆరోజే ప్రజలందరు మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగ వస్తున్న సాంప్రదాయం కాబట్టి ఇది గమనించి వ్యవహరించుకోవడం ఉత్తమం.