శ్రీ రామనవమి పర్వదినము రోజున ప్రాతః కాలమున అనగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి, పూజా మందిరము, ఇంటిని శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మామిడి తోరణములతో ఇంటిని అలంకరించాలి. పూజామందిరమును పుష్పాలతోను, గడపలకు పసుపు, కుంకుమలతోనూ, ఇంటి ముందు రంగవల్లికలతోనూ అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి.

శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, పండ్లను సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
శ్రీ రామనవమి రోజున శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీ రామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది. నవమిరోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి.
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అనగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీ రామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు బెల్లం, మిరియాలతో తయారు చేసిన పానకాన్ని అందిస్తారు. అలాగే రామాయణాన్ని పారాయణ చేస్తారు. రాముల వారి కల్యాణంతో దేశం సిరి, సంపదలతో తులతూగుతుందని భక్తుల విశ్వాసం.
శ్రీరామనవమి పండుగను మన తెలుగు లోగిళ్లలో చాలా వైభవంగా జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. శ్రీరాముడు వసంతఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీరాముడి జన్మదినాన్ని శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో అడుగిడిన శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకున్నది, సీతారాముల కళ్యాణం జరిగినది ఇదే రోజున అని నమ్మకం.
అందుకే కొన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి రోజున శ్రీరాముడి జన్మదిన వేడుకలు జరుపుకుంటే, మరికొన్ని ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని జరుపుతారు. తెలంగాణలోని భద్రాచల మందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలో మాత్రం చైత్ర మాస పూర్ణిమ నాడు రాత్రివేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథునికి ముగ్గురు భార్యలు. వారు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు.
ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుని కిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్యయైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు.
శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. ఒకసారి పార్వతీదేవి పరమశివుని "కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం" అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్ర నామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం "శ్రీరామనవమి" గా విశేషంగా జరుపుకుంటాం.
ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్ర మందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే శ్రీరామ నామ గానమధుపానాన్ని, భక్తితో సేవించి కీర్తించాడు.
మనం శ్రీరామ నామాన్ని ఉచ్ఛరించేటప్పుడు "రా" అనగానే మన నోరు తెరచుకుని మన లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామ నామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగనే "మ" అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు "రామ నామ స్మరణ" మిక్కిలి జ్ఞానాన్ని, జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధా శక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగ కోక ప్రసాదం ఉంటుంది. భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం దానిని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఋతువుని బట్టీ దేవునికి సమర్పించే నైవేద్యం మారుతుంటుంది. ఉగాదితో వేసవి ఆరంభమవుతుంది. ఉగాదికి షడ్రుచుల పచ్చడిని ఎలా అయితే స్వీకరిస్తామో, శ్రీరామనవమి రోజున రాముల వారి కల్యాణం అనంతరం భక్తులకు వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా పంచిపెడతారు. ఉగాది నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. అందుకే శ్రీరామనవమికి తాటాకు పందిళ్లు వేస్తారు. అయితే పానకాన్ని పంచడం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంది. పానకం తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. పానకంలో వేసే బెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అందులోనే ఐరన్ కూడా ఉంటుంది. అలాగే మిరియాలు కఫాన్ని తగ్గిస్తాయి. శొంఠి వల్ల దగ్గు రాకుండా ఉంటుంది. శరీరంలో ఉష్ణ శాతాన్ని సమంగా ఉంచుతుంది.
యాలుకలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. ఇది జీర్ణప్రక్రియను సరిచేస్తుంది. తులసీదళం శ్రీ రామ చంద్రుల వారికి ప్రీతి పాత్రమైనది. రామనవమి రోజున రాముల వారిని ముఖ్యంగా తులసీ దళంతోనే పూజిస్తారు. తులసి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే వడపప్పు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అలా అని ప్రతిరోజూ పానకాన్ని తాగరు. అందుకే వేసవి ఆరంభంలో రాముల వారి కల్యాణం జరిగిన సందర్భంగా ప్రజలందరికీ ఇలా పానకాన్ని పంచిపెడతారు.