← అన్ని పండుగలు

ఉగాది ప్రాముఖ్యత

ఆ పర్వదినము రోజున ప్రాతః కాలమున అనగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని, తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి మామిడి తోరణములతో ఇంటిని అలంకరించాలి. ఆ తర్వాత దైవానికి పుష్పార్చన,అర్ఘ్యం,ధూప దీపాదులను సమర్పించి వేప పచ్చడిని స్వీకరించాలి. పచ్చడి స్వీకరించే ముందు ఎలాంటి ఆహార పదార్ధాలను తినకూడదు.

ఉగాది

ఉగాది చైత్రమాసంలో మొదలవుతుంది. ఆ రోజును తెలుగు సంవత్సరపు మొదటి రోజుగా పరిగణిస్తాం. అరవై సంవత్సరాలు ప్రభవతో మొదలై, అక్షయతో పూర్తవుతాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. ఆ నక్షత్ర గమనానికి ఆది "ఉగాది". ఆ ప్రకారంగా సృష్టి ఆరంభమైన సుముహూర్తమే "ఉగాది".


చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు.


చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా "ఉగాది" ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా "ఉగాది" పండుగను జరుపుకుంటారు.


వసంతఋతువు ప్రతి చెట్లు పచ్చని చిగుర్లతో కళకళలాడే ఋతువు. ఋతువుల్లో ఆఖరి ఋతువు "శిశిరఋతువు". ఈ శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలిపోతాయి. వసంతఋతువుతో చెట్లన్నీ చిగురిస్తాయి. దీంతో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఉగాది పండగతో వసంత ఋతువు ఆరంభం అవుతుంది. ఋతువుల రాణీ వసంతఋతువు. తెలుగు నెలలైన చైత్ర, వైశాఖ మాసాలను వసంతఋతువు కనువిందు చేస్తుంది. వసంతఋతువు తరువాత గ్రీష్మఋతువు వస్తుంది.ఇలా కాలచక్రంలో ఆరు ఋతువులు ఈ పర్యావరణాన్ని నడిపిస్తుంటాయి.


ఉగాది సందర్భంగా వసంతఋతువులోకి ప్రవేశిస్తున్న కారణంగా శారీరకంగా, మానసికంగా తలెత్తే మార్పుల్ని కట్టడి చేసి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ఉగాది పచ్చడి దోహదం చేస్తుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పచ్చడి మన జీవితంలో జరిగే సుఖ దుఃఖాలను సూచిస్తుంది. ఇందులోని రుచులలో ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది.


ఉప్పు : దీనిని జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. ఇది రుచిని, భయాన్ని సూచిస్తుంది. ఉప్పు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కలిగిస్తుంది. కానీ ఉప్పును అధికంగా వాడకూడదు.


పులుపు : పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. ఎలాంటి పరిస్థితులకైనా ఓర్పుగా ఉండాలని సూచిస్తుంది. జీర్ణశక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.


వేప పువ్వు : బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. వేపపూత మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగిస్తుంది. రక్తమును శుద్ధి చేస్తుంది. మామిడి, చింతపండుతో పాటు వేపను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి బాడీలోని విషపదార్థాలు బయటకి వస్తాయి.


బెల్లం : ఈ తియ్యని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కొత్త బెల్లాన్ని తింటే మనకు ఆకలి కలగడమే కాక మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. ఇందులో ఉండే గుణాలు టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఇది పిత్తం, వాతం సమస్యలను తగ్గిస్తుంది. కొత్త కణాలను ఏర్పరిచేందుకు సహాయపడుతుంది.


కారం : సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. మితంగా తీసుకుంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది.


వగరు : పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. ఇవి శరీరాన్ని బలంగా చేస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతి రోజూ తినడం వల్ల గ్యాస్ట్రిక్, గుండె సమస్యల నుంచి దూరం చేస్తుంది.


షడ్రుచులతో కూడిన ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యంగా సమర్పించి తమ భవిష్యత్‌ జీవితాలు ఆనందంగా సాగాలని ప్రార్థిస్తారు. ఇష్టంగా ఉగాది పచ్చడి తింటారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు తెలుసుకునే కార్యక్రమమే పంచాగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. ప్రకృతితో ముడిపడిన ఈ పండుగ ప్రతి జీవికీ చైతన్యంతో కూడిన ఆనందాన్నిస్తుంది.